చంద్రపూర్ : జిల్లాలోని తాడోభా అభయారణ్యాలలో పులులను లెక్కించేందుకు వెళ్లిన మహిళా అటవీశాఖ అధికారి స్వాతి డుమ్నే ( 43 ) పై దాడిచేసిన పులి ఆమెను హతమార్చింది.

ఈఘటన శనివారం ఉదయం తొమ్మిది గంటలకు చోటుచేసుకుంది. దీంతో అటవీశాఖ సిబ్బందిలో ఆందోళన మొదలైంది. వివరాలలోకి వెళితే ప్రపంచ ప్రసిద్ది చెందిన చంద్రపూర్ లోని తాడోబా అభయారణ్యాలలో పులులలను తిలకించేందుకు దేశవిదేశాలకు చెందిన పర్యాటకులు వస్తుంటారు. ఈఅడవులలో జాతీయ పులుల గణన ఆదేశాలు మేరకు ఈనెల 19 నుంచి 26 వరకు పులులను లెక్కించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా కోరోజోన్లోని కొలర ద్వారం గుండా ఫారెస్టు రేంజర్ స్వాతి తమ సిబ్బందితో అభయారణ్యాయలోకి ప్రవేశించింది.

అదేమార్గంలో 200 మీటర్ల దూరంలో పర్యాటకులను ఎప్పుడూ కనువిందుచేసే మాయా అనే పులి మార్గంలో తిష్టవేసింది. ఇది గమనించిన స్వాతి బృందం అది అడవులలోకి తిరిగి వెళుతుందని సుమారు గంటన్నర సేపు ఎదురుచూసారు. కాని మాయలో ఎలాంటి కదలికలు లేకపోవడంతో మరోమార్గం గుండా అడవిలోకి వెళ్లుచుండగా ఒక్కసారిగా పులి వారిపై దాడిచేసి స్వాతిని నోటకరుచుకొని అడవులలోకి ఈడ్చుకు వెళ్లింది. సిబ్బంది ఆమెను విడిపించేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. ఆందోళన చెందిన సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న జితేంద్ర రాంగావ్కర్ బృందం అడవిలోని పరిసరాలను గాలించగా ఆమెశవం కనిపించింది.

దీంతో శవాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు శవపరీక్షల నిమిత్తం చిమూర్ లోని తాలూకా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటవీశాఖలో మంచి ప్రతిభావంతురాలుగా పేరొందిన స్వాతి నాలుగు నెలల క్రితమే రాజురా అటవీ విభాగం నుంచి చిమూర్ విభాగానికి బదిలీపై వెళ్లింది. జీవితీ తాలూకాలకు చెందిన స్వాతి కి భర్తతోపాటు ఓకుమార్తె ఉన్నారు.